Eenadu.us

The Complete News Site

టీఆర్‌ఎస్‌లో పెరుగుతున్న అసమ్మతి.. రెబల్‌గా పోటీ చేస్తామని వార్నింగ్

అభ్యర్థులను మార్చాలంటూ అధిష్ఠానానికి విన్నపాలు
రెబల్‌గా పోటీ చేస్తామని బహిరంగ ప్రకటనలు
సమావేశాలు ఏర్పాటు చేసి మరీ తీర్మానాలు
జూబ్లీహిల్స్‌లో మాగంటికి వ్యతిరేకంగా..
శేరిలింగంపల్లిలో ఆరెకపూడిపై..
భేతిని మార్చాలంటున్న కార్పొరేటర్లు
మేయర్‌కు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి
మల్లారెడ్డి, మైనంపల్లిని కలిసి వినతి
మెజార్టీ నియోజకవర్గాల్లో అదే పరిస్థితి
కూకట్‌పల్లి.. కుత్బుల్లాపూర్‌.. ఉప్పల్‌.. రాజేంద్రనగర్‌.. ఇలా పలు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ప్రకటించిన అభ్యర్థులపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సమావేశాలు పెట్టి మరీ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో అభ్యర్థులను మార్చాలని కొందరు డిమాండ్‌ చేస్తుంటే… తమకు అవకాశం కల్పించాలని ఇంకొందరు కోరుతున్నారు. ఊహించని ఈ పరిణామాలతో పార్టీ పెద్దలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భంగపడ్డ నేతలను బుజ్జగించే ప్రయత్నం చేస్తూనే.. కొన్నిచోట్ల మార్పు అంశాన్ని పరిశీలించాలని అధినేత దృష్టికి తీసుకెళ్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్‌: శనివారం నగరం కేంద్రంగా టీఆర్‌ఎస్‌ రాజకీయం రసకందాయంగా నడిచింది. ఇప్పటికే తిరుగుబావుటా ఎగురేసిన వారు వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతుండగా.. తాజాగా మరి కొందరు కార్పొరేటర్లు ఆ అభ్యర్థులకు సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు. ఓ వైపు మంత్రి కే తారకరామారావు బుజ్జగింపు ప్రయత్నాలు, ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు రచిస్తుండగా.. మరోవైపు అసమ్మతి పెరుగుతుండడం పార్టీ శ్రేణులను కలవరానికి గురి చేస్తోంది. కాగా.. టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలను కలుస్తూ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తూనే… కొన్నిచోట్ల అభ్యర్థుల మార్పు అంశాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం.
కూకట్‌పల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు టికెట్‌ ఇవ్వడాన్ని నియోజకవర్గంలోని నాయకులు, కార్పొరేటర్‌ భర్త వ్యతిరేకిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గొట్టిముక్కల పద్మారావు, మరో నాయకుడు వెంకటేశ్వర్‌రావు, కూకట్‌పల్లి కార్పొరేటర్‌ పన్నాల కావ్యరెడ్డి భర్త పన్నాల హరీశ్వర్‌రెడ్డి తమకు టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. ఇతర పార్టీల నుంచి ఆఫర్‌ ఉందని గొట్టిముక్కల చెబుతుండగా.. రెబల్‌గా బరిలో దిగుతానని పన్నాల పేర్కొంటున్నారు.
కుత్బుల్లాపుర్‌ నియోజకవర్గంలోనూ అసమ్మతి సెగ రాజుకుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు అవకాశం కల్పించడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్‌ ఆశించి భంగపడ్డ కొలను హన్మంత్‌రెడ్డి రెబల్‌గా పోటీ చేస్తానని చెబుతున్నారు. ఆయనను బుజ్జగించేందుకు పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.
రాజేంద్రనగర్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ పేరు ఖరారైన నేపథ్యంలో ఇక్కడి సీనియర్‌ నేత శ్రీశైలంరెడ్డి నిరాశకు లోనయ్యారు. తనకు అవకాశం కల్పించాలని కోరుతోన్న ఆయన.. ఇతర పార్టీల్లో చేరేందుకు మంతనాలు సాగిస్తున్నారు. శ్రీశైలంరెడ్డి కొడుకు శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్‌గా ఉన్నారు.
జూబ్లీహిల్స్‌ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్‌ను ప్రకటించడం పట్ల ఆ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంగళరావునగర్‌ కార్పొరేటర్‌ కిలారి మనోహర్‌, రహ్మత్‌నగర్‌ కార్పొరేటర్‌ షఫి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మురళిగౌడ్‌, మాజీ కార్పొరేటర్‌ సదాశివయాదవ్‌లు యూసుఫ్‌గూడలోని విక్టరీ ఫంక్షన్‌ హాల్‌లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. మాగంటి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ విషయాన్ని హైకమాండ్‌ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అవకాశం ఇస్తే తానే పోటీ చేస్తానని 2014 ఎన్నికల్లో బరిలోకి దిగి ఓటమిపాలైన మురళి స్పష్టం చేశారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనూ అసమ్మతి రాజుకుంటోంది. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించాలని మాదాపూర్‌ కార్పొరేటర్‌ జగదీశ్వర్‌గౌడ్‌ కోరుతున్నారు. ఆరెకపూడి గాంధీ అభ్యర్థిత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. అనుచరులు, పార్టీ నాయకులతో ఆదివారం సమావేశమై చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఆయన భార్య పూజితా గౌడ్‌ హఫీఫిజ్‌పేట కార్పొరేటర్‌గా ఉన్నారు.

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com