Eenadu.us

The Complete News Site

పోలీస్‌ పోస్టులపై ఎన్నికల ఎఫెక్ట్‌!

బందోబస్తుకు బలగాల మోహరింపు
రాతపరీక్షలు జరిగినా ఎన్నికల తర్వాతే పీఈటీ
రేపు ఎస్సై ఐటీ, ఏఎస్సై రాతపరీక్షలు
హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో పోలీసు కొలువుల భర్తీ ప్రక్రియపై ప్రభావం పడింది. పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో బిజీబిజీగా మారనుండటంతో ఎంపిక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసు నియామక బోర్డు ప్రకటించిన ప్రకారం డిసెంబరుకల్లా ఎంపిక ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంది. కానీ, ముందస్తు ఎన్నికలతో ఎంపిక ప్రక్రియకు బ్రేక్‌ పడే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల బందోబస్తు, ఫలితాల వెల్లడి, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి నవంబరు, డిసెంబరులో పోలీస్‌ శాఖ బిజీబిజీగా మారిపోతుండటంతో నియామక ప్రక్రియపై ప్రభావం కచ్చితంగా పడనుంది. రాష్ట్ర పోలీ్‌సశాఖలోని ఖాళీల భర్తీకి షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు జరగనున్నాయి. ముందస్తు ఎన్నికలు… కొత్త జోన్ల అంశం తెరపైకి రావడంతో ప్రస్తుత నోటిఫికేషన్‌ రద్దు అవుతుందేమోనన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. నోటిఫికేషన్‌ గత మే నెలలో జారీ అయినందువల్ల ఎలాంటి ఆటంకం ఉండదని అధికారులు చెబుతున్నారు. కొత్త జోన్లకు సంబంధించి నోటిఫికేషన్‌లో మార్పులు చేయాల్సి వస్తే న్యాయశాఖ, జీఏడీ నుంచి ఉత్తర్వులు వెలువడితే తప్ప మార్పులకు ఆస్కారం లేదని అధికారవర్గాలు వివరించాయి. ఎస్సై ప్రాథమిక రాతపరీక్ష పూర్తిచేసి కీ విడుదల చేశారు. ఎస్సై (ఐటీసీ), ఏఎస్సై ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో పోస్టుల భర్తీకి ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. పోలీస్‌ శాఖలోని 18,428 పోస్టుల భర్తీకి నియామక బోర్డు గత మే 31న నోటిఫికేషన్‌ జారీ చేసింది. కానిస్టేబుల్‌ సివిల్‌, తదితరాలకు సెప్టెంబరు 30న ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్‌ ప్రకటించారు.
పీఈటీపై ఎన్నికల ప్రభావం..
రాత పరీక్షలో అర్హత పొందిన వారికి శరీర దారుఢ్య పరీక్షలు(పీఈటీ) నిర్వహిస్తారు. ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొనడంతో అధికారులు, సిబ్బంది ఎన్నికల బందోబస్తుపై దృష్టి సారించనుండటంతో పీఈటీ పరీక్షలపై ప్రభావం పడే అవకాశం ఉంది. రాతపరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం పూర్తి చేసి పీఈటీ పరీక్షలు ఎన్నికల తర్వాత చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం కొంత కష్టమని, వీలైనంత త్వరగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com