Eenadu.us

The Complete News Site

టీఆర్‌ఎస్ పార్టీలో అసమ్మతి సెగ.

టీఆర్‌ఎస్ పార్టీలో అసమ్మతి సెగ మొదలైంది. టికెట్లు ఆశించి భంగపడ్డ ఆశావాహులు తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటించగానే టీఆర్‌ఎస్ నేతల మధ్య కుమ్ములాటలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. టికెట్లు దక్కని నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఎల్‌బి నగర్, మహేశ్వరం, తాండూరు, పరిగి, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బూల్లాపూర్, షాద్ నగర్, కల్వకర్తి, ఉప్పల్, కొడంగల్, మేడ్చల్, వికారాబాద్, మల్కాజిగిరి తదితర నియోజకవర్గాల్లో అసమ్మతి రాజుకుంది.
అయితే మేడ్చల్, వికారాబాద్, మల్కాజిగిరి అభ్యర్థులను ప్రకటించనప్పటికీ ఇక్కడన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించకపోవడంతో వారంతా అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. అన్ని నియోజకవర్గాలలో మూడు గ్రూపులు, ఆరు పంచాయతీలు అన్న చందంగా జిల్లాలో టీఆర్‌ఎస్ పరిస్థితి దాపురించింది. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వారి ప్రయత్నాలకు అధిష్టానం గండికొట్టింది. కేవలం సిట్టింగ్‌లకే టిక్కెట్లు ఇవ్వడంపై జిల్లా వ్యాప్తంగా అసమ్మతి సెగ పుట్టింది. 2014 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా బరిలో దిగిన వారిలో ముగ్గురికి మినహా అందరికీ టిక్కెట్లు ఇచ్చింది. ఇప్పుడదే టీఆర్‌ఎస్ కొంపముంచనుంది.
నియోజకవర్గాల వారీగా అసమ్మతి సమావేశాలు
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వారీగా అసమ్మతి నేతలు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. షాద్‌నగర్ నేతలు ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఓ టీఆర్‌ఎస్ నేత ఇంట్లోనే అసమ్మతి సమావేశం పెట్టుకున్నారు. అన్ని పార్టీలలో ఉన్న టికెట్లు ఆశిస్తున్న వారందరిని ఏకతాటికిపైకి తీసుకువచ్చి టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఓడించాలన్న లక్ష్యంగా పని చేయాలని పిలుపునిస్తున్నారు. జిల్లాలో టీఆర్‌ఎస్ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోందని ఆపార్టీ నేతలు వాఖ్యానిస్తున్నారు. గులాబీ పార్టీలో నేతలు గ్రూపులు, గ్రూపులుగా విడిపోతున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ పూర్తిగా వర్గపోరుతో పార్టీలో క్రమశిక్షణ గాడి తప్పుతోంది. నేతల కుమ్ములాటలతో టీఆర్‌ఎస్ ప్రతిష్ఠ మంటకలుస్తోందన్న వాదనలు గులాబీ నేతల్లో వినిపిస్తోంది. నియోజకవర్గాల్లో గ్రూపులు కడుతున్న నేతలు, జిల్లాలోని నగర శివారులో ఉన్న నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో స్థానిక నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు గులాబీ పార్టీ అధినాయ కత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి.
అభిమానులు, కార్యకర్తలతో భవిష్యత్తు కార్యచరణ ప్రణాళికకు సిద్ధం..
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం తనకే టీఆర్‌ఎస్ టికెట్ వస్తోందని ధీమాతో ఉన్న ఆయన ఇప్పుడు వేరే దారులు చూసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇందుకు సంబంధించి చేవెళ్లలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సీహెచ్‌ఆర్ గార్డెన్‌లో అభిమానులతో, కార్యకర్తలతో భవిష్యత్తు కార్యచరణ ప్రణాళికకు సిద్ధమవుతున్నారు. 2014 ఎన్నికల్లో తనపై పోటీ గెలుపొందిన వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత టీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకోవడం మళ్లీ టికెట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అధిష్టానంపై తిరుగుబాపుటా ఎగురవేస్తున్నారు.
కంచర్ల కంచికేనా..?
ఇబ్రహీంపట్నం సీటును సిట్టింగ్ ఎమ్మెల్యేకే దక్కడంతో ఆ పార్టీలో లుకలుకలు మొదలైయ్యాయి. పార్టీలోని మరో వర్గం నేతలు సమావేశం ఏర్పాటు చేసుకుని సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఒంటికాలుతో లేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి కథ కంచికే అన్నట్లుగా తయారైంది. అయితే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వర్గాలు అన్ని కలిసి బరిలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. కంచర్ల మాత్రం అంశంపై నోరుమెదపడం లేదు. హయత్‌నగర్‌లో వ్యతిరేకవర్గం తమ రాజకీయ భవిష్యత్తుపై సమాలోచనలు చేశారు.
కల్వకుర్తిలో సైతం అసమ్మతి రాగం..
కల్వకుర్తిలో నియోజకవర్గంలోనూ అధికార టీఆర్‌ఎస్ పార్టీలో అసమ్మతి రాగం అందుకుంది. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కే మళ్లీ టిక్కెట్ ప్రకటించడంతో ఆశలు పెట్టుకున్న నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు మరికొంత మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు.
నగర శివారు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి..
మహేశ్వరం నుంచి 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన కొత్త మనోహర్‌రెడ్డికి కూడా టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన దారేటన్నది సందిగ్ధంలో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వడంతో ఆశలు పెట్టుకున్న నేతల ఆడియాశలయ్యాయి. ఇలా శేరి లింగంపల్లి, కుత్బుల్లాపూర్, పరిగి, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఉప్పల్, కొడంగల్, మేడ్చల్, వికారాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో అసమ్మతి రాజుకున్నట్లయింది.

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com