Eenadu.us

The Complete News Site

అన్నింటి కన్నా అవకాశమే గొప్పది: రజనీకాంత్‌

హైదరాబాద్‌: తమిళ ప్రేక్షకులు ఎంత ప్రేమ చూపిస్తున్నారో, తెలుగు వారూ అంతే ప్రేమ చూపిస్తున్నారని అన్నారు రజనీకాంత్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కాలా’. పా.రంజిత్‌ దర్శకత్వం వహించారు. వండర్‌బార్స్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ధనుష్‌ నిర్మిస్తున్నారు. సంతోష నారాయణ్‌ బాణీలు సమకూర్చారు. జూన్‌7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్‌ వేడుకలో రజనీ మాట్లాడారు. ‘‘1978లో ‘అంతులేని కథ’ నా తొలి తెలుగు చిత్రం. దాని తర్వాత 15 నుంచి 20 తెలుగు సినిమాలు చేశా. ఆ సమయంలో తెలుగు పరిశ్రమలో కొనసాగాలా? లేక తమిళ చిత్రాల్లో కొనసాగాలా? అని నాకో సందేహం కలిగింది. బాలచందర్‌ సినిమాతో నా కెరీర్‌ అక్కడే ప్రారంభం కావడంతో నేను అక్కడే కొనసాగాలని అనుకున్నా. అయితే, తమిళ ప్రేక్షకులు ఎంత ప్రేమ చూపిస్తున్నారో, తెలుగు వారూ అంతే ప్రేమ చూపిస్తూ వచ్చారు. చాలా రోజుల తర్వాత ‘పెదరాయుడు’తో మంచి బ్రేక్‌ వచ్చింది. ఆ తర్వాత ‘బాష’ దగ్గరి నుంచి ‘కబాలి’ వరకూ అన్ని చిత్రాలు ఇక్కడ విడుదలయ్యాయి. నేను హైదరాబాద్‌ ఎప్పుడు వచ్చినా ఎన్టీఆర్‌ ఆశీస్సులు తీసుకునేవాడిని. నాకు బాలచందర్‌ తర్వాత మరో గురువు దాసరి నారాయణరావు. ఆయన ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. ‘ఒకే రజనీకాంత్‌’ అని ధనుష్‌ అన్నారు. అయితే, ఒకే చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌, బాలకృష్ణ ఇలా ఎవరి ప్రాముఖ్యత వారిది. అవకాశాలే మనకు పేరు ప్రఖ్యాతులను తెస్తాయి. కొందరు దేవుడు దయ వల్లే ఈ స్థాయిలో ఉన్నారని చెబుతారు. ఎవరెన్ని చెప్పినా, అవకాశాలు రావాలి. ‘కబాలి’ చేసినప్పుడు ‘ఇంత చిన్న దర్శకుడితో రజనీ చేస్తున్నారేంటి’ అని అందరూ అనుకున్నారు. కానీ, కథ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చింది. అందులో మంచి సందేశం ఉన్నా, అది కమర్షియల్‌గా హిట్‌కాలేదు. ఇక ‘కాలా’లో ముంబయి మురికివాడల్లో పేద ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను చూపించాం. సినిమాలో ఉండే అయిదారు పాత్రలు మీకు గుర్తుండిపోతాయి. రంజిత్‌ చాలా చక్కగా తీశారు. సంతోష నారాయణ బెస్ట్‌ సంగీతం అందించారు. ఈశ్వరీరావు చక్కన నటన ప్రదర్శించారు. ధనుష్‌ మంచి నటుడే కాదు, మంచి నిర్మాత అని కూడా రుజువు చేసుకున్నారు. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది’’ అని అన్నారు.

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com